Site icon NTV Telugu

INDIA Bloc: ఎన్నికల కమీషన్ ముందు ఇండియా కూటమి 5 డిమాండ్లు..

India Bloc

India Bloc

INDIA Bloc: ఢిల్లీ రామ్ లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నేతలు మహార్యాలీని నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అయితే, ‘‘సేవ్ ఫ్యామిలీ’’, ‘‘అవినీతిని దాచిపెట్టు’’ అనే దాని కోసమే ఈ ర్యాలీని ప్రతిపక్షాలు నిర్వహించాయని బీజేపీ ఆరోపించింది.

ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కమీషన్(ఈసీ)కి 5 డిమాండ్లను చేసింది.

* కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిధులను స్తంభింపచేయడం, ఐటీ శాఖ నోటీసుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష పార్టీల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ఆపాలని కోరారు.

* ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ చర్యలను నిలిపేయాలని డిమాండ్ చేశారు.

* ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా బిజెపి “దోపిడీ” చేసిన నిధులను సుప్రీం కోర్టు పర్యవేక్షించే ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

* లోక్‌సభ ఎన్నికల్లో అందరికి సమాన అవకాశాలు ఉండేలా చూడాలి.

* హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ని తక్షణమే విడుదల చేయాలి.

ఈ ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని, ఆ తర్వాత దేశం మంటల్లో కూరుకుపోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కావాలో, నియంతృత్వం కావాలో తేల్చుకోవాలని ప్రజలే నిర్ణయించుకోవాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదని ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.

Exit mobile version