SIR Protest: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఇన్నాళ్లు దేశ రాజధాని ఢిల్లీకి పరిమితమైన నిరసనల్ని ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 5న బెంగళూర్‌లోని ఫ్రీడమ్ పార్క్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష కూటమి నేతలు ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి రాష్ట్రాలకు ఆందోళనలు..
నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వంటి వారు హాజరయ్యారు. ఇప్పుడు నవంబర్ 5న బెంగళూర్‌లో కార్యక్రమం ఉంటుందని కర్ణాటక పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత బీకే హరిప్రసాద్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రం చేయాలని కూటమి నేతలు నిర్ణయించారని, ఈ ఉద్యమాన్ని జిల్లా, తాలూకా, బ్లాక్ స్థాయిలకు తీసుకెళ్తామని అన్నారు.
కర్ణాటక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కే ప్రకాశ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో మార్పులు తేవాలనే మూడు డిమాండ్లను ప్రస్తావించారు. భారత్‌ను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్లేందుకు, మతతత్వ హిందుత్వ దేశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్ని్స్తోందని ఆరోపించారు.

