India Bloc: కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. బుధవారం కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు రావడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది. అయితే నేపథ్యంలో కీలక రాష్ట్రాల్లో దారుణ ఓటమి తర్వాత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునివ్వగా బీహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ మీటింగ్‌ని దాటవేయాలని అనుకుంటున్నారు.
మరోవైపు కూటమిలో కీలక నేతగా ఉన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరుకావడం లేదని తెలుస్తోంది. మైచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు సీఎం స్టాలిన్ రావడం లేదు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో కీలక నేతల గైర్హాజరుతో ఇండియా బ్లాక్ సమావేశం వాయిదా పడింది. కూటమిలో కీలక సభ్యుల సంప్రదించి రెండు వారాల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
Read Also: Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..
2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ మూడు కీలక రాష్ట్రాల్లో ఓడిపోవడం కూటమిపై ప్రభావాన్ని చూపించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇలా ఓడిపోవడం, ముఖ్యంగా హిందీ బెల్టు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం కాంగ్రెస్‌కి పెద్ద దెబ్బ. అయితే ఎంపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీలో సీట్ల పంపకాలపై విభేదాల కారణంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్‌కి అంటీముట్టనట్లు ఉంటున్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ, జేడీయూ, టీఎంసీ, ఆప్, డీఎంకే, జేఎంఎం పార్టీలతో పాటు కమ్యూనిస్ట్, ఇతర చిన్నాచితక పార్టీలు కూటమిని ఏర్పాటు చేశాయి. వీటి తొలిసమావేశం పాట్నాలో జరగగా, బెంగళూర్, ముంబైలో తర్వాత సమావేశాలు జరిగాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు కూటమిలో చర్చ జరగలేదు.
