రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సభలో ప్రతిపక్షంపై చిన్న చూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తీర్మానానికి ఇండియా కూటమి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) కింద పార్టీలు మోషన్‌ను ముందుకు తెస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా కూటమికి చెందిన అన్ని పార్టీలు మోషన్‌పై సంతకం చేశాయి
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఉభయ సభలు ప్రారంభం అయిన దగ్గర నుంచి అదానీ లంచం వ్యవహారం సభలను కుదిపేస్తున్నాయి. దీంతో రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశం సభల్లో రగడ సృష్టిస్తోంది. అయితే సభలో ఛైర్మన్ ధన్‌కర్ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్షం పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇండియా కూటమి ఎంపీలంతా ఈ విషయంలో ఒక్కటవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉభయ సభల్లో గందరగోళం నేపథ్యంలో సభా నాయకుడు జేపీ నడ్డాను, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను తన ఛాంబర్‌కు రావాలంటూ ఛైర్మన్ ఆహ్వానించారు. సభలో చోటుచేసుకున్న పరిణామాలపై ధన్‌కర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సభ సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఛైర్మన్ చర్చించనున్నట్లు సమాచారం.