Site icon NTV Telugu

INDIA Bloc: రేపు ఇండియా కూటమి కీలక భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

India Bloc Leaders Key Meet

India Bloc Leaders Key Meet

ఇండియా కూటమి మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు నేతలంతా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ఆయా అంశాలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ ఆంశాలు లేవనెత్తుతోంది. అలాగే బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ను విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలంతా చర్చించనున్నారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు రచించనున్నారు. ఇక ఈ కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలిగింది. మిగతా పక్షాలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక సమావేశం తర్వాత ప్రతిపక్ష ఎంపీలంతా బీహార్ ఎన్నికల ప్రక్రియపై, పహల్గామ్ ఉగ్రదాడి, జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ నిరసన చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు.. దగ్గరపడుతున్న డెడ్‌లైన్!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. మొత్తం 32 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పార్లమెంటు ఉభయ సభలు ఆగస్టు 12 నుంచి ఆగస్టు 17 వరకు వాయిదా పడతాయి. తిరిగి ఆగస్టు 18న సమావేశమవుతాయి.

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో కీలక పరిణామం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ ఎన్నికయ్యారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక రాజీనామా లేఖలో ప్రధాని మోడీకి, రాష్ట్రపతికి ధన్‌ఖడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ధన్ ఖడ్ రాజీనామాపై అనేకమైన వదంతులు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే రాజీనామా చేశారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. బీహార్ వ్యక్తికి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.

Exit mobile version