NTV Telugu Site icon

INDIA bloc: కాంగ్రెస్‌కు ఇండియా కూటమి చాలా కీలకం, కానీ.. సీఎం నితీష్‌తో ఖర్గే..

Nitish Kumar, Kharge

Nitish Kumar, Kharge

INDIA bloc: 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కూటమిలోని పార్టీలన్నీ మూడు సమావేశాలను నిర్వహించాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇండియా కూటమిలోని పలువురు మిత్రపక్షాల నేతలు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించలేదని సమాజ్ వాదీ పార్టీ(చీఫ్) అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.

తాజాగా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో జోరు తగ్గిందని, దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల ఎన్నికను చూసుకుంటూ కూటమిని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది.

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీష్ కుమార్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి చాలా కీలమని, అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష కూటమి వ్యూహాలు, ఉమ్మడి ర్యాలీలపై దృష్టి సారిస్తామని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Rachin Ravindra: న్యూజిలాండ్ యువ సంచలనం అరుదైన రికార్డ్.. ఆడిన తొలి వరల్డ్ కప్లోనే..!

తెలంగాణ, మధ్యప్రదేవ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించినట్లు ఖర్గే, నితీష్ కుమార్ కు చెప్పినట్లు విశ్వసనీయ సమచారం. నవంబర్ 2న, ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ నిమగ్నమై ఉందని, ఇటీవల నెలల్లో ఇండియా కూటమిలో ఉన్న జోరు కనిపించడం లేదని నితీష్ కుమార్ ఆరోపించారు.

‘బీజేపీ హటావో, దేశ్ బచావో’ (బీజేపీని అధికారం నుండి తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి) అనే థీమ్‌తో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో జేడీ(యు) నాయకుడు ఈ వ్యాఖ్య చేశారు. మేమంతా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పాత్ర కేటాయించడానికి అంగీకరించాము, కానీ వారు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు. జూన్ నెలలో ఇండియా కూటమి తొలి సమావేశాన్ని పాట్నాలో సీఎం నితీష్ కుమారే నిర్వహించారు. దీని తర్వాత బెంగళూర్, ముంబైలలో సమావేశాలు జరిగాయి.