Onion Exports: దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను అదుపులో ఉంచడంతో పాటు, సామాన్యులకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ఎగుమతులపై వచ్చే ఏడాది మార్చి వరకు నిషేధాన్ని విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘‘ఉల్లిపాయల ఎగుమతి విధానం.. మార్చి 31, 2024 వరకు నిషేధించబడింది’’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) నోటిఫికేషన్‌లో తెలిపింది.
దేశ రాజధానిలో స్థానిక విక్రేతలు కిలో ఉల్లిని రూ.70-80 చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి ముందు వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైన్ మార్కెట్‌లలో ఉల్లి బఫర్ స్టాక్‌ని కిలోకు రూ. 25 చొప్పున విక్రయించాలని కేంద్రం అక్టోబర్ నెలలో నిర్ణయించింది. ధరల నియంత్రణకు కేంద్రం గతంలో అనేక చర్యలు తీసుకుంది. అక్టోబర్ 28 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు కనిష్ట ఎగుమతి ధర(ఎంఈపీ)ని 800 డాలర్లుగా విధించింది. ఆగస్టు నెలలో డిసెంబర్ 31 వరకు ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది.
Read Also: karnatak: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. చప్పట్లు కొట్టి మరీ పెళ్లి ఆపింది..
అయితే, ఉల్లి ఎగుమతులపై పలు దేశాల అభ్యర్థన మేరకు మంజూరు చేసిన అనుమతి ఆధారంగా అనుమతించబడుతుందని డీజీఎఫ్‌టీ తెలిపింది. ఈ నోటిఫికేషన్ ముందు వరకు లోడైన ఉల్లిపాయల షిప్‌మెంట్‌ల ఎగుమతి చేసుకోవడానికి అనుమతించబడుతుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి చేసింది. దేశం నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే టాప్-3 దేశాల్లో బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ ఉన్నాయి. ఈ ఖరీఫ్ కాలంలో వర్షాలు, ఇతరత్రా వాతావరణ సమస్యలు ఉల్లి పంటపై ప్రభావం చూపడంతో, ధరలు పెరిగాయి. నవంబర్ 14న విడుదల చేసిన డబ్ల్యుపిఐ డేటా ప్రకారం, కూరగాయలు మరియు బంగాళదుంపల ద్రవ్యోల్బణం వరుసగా (-) 21.04 శాతం మరియు (-) 29.27 శాతం వద్ద ఉండగా.. అక్టోబర్ నెలలో మాత్రం ఉల్లి వార్షిక ధర పెరుగుదల రేటు 62.60 శాతం వద్ద అధికంగా ఉంది.