NTV Telugu Site icon

INDIA Alliance: ఇండియా కూటమిలో మరో ముసలం.. రసవత్తరంగా ‘‘మహా’’ రాజకీయం..

India Alliance

India Alliance

INDIA Alliance: ఢిల్లీలో ఆప్ ఓటమి ఇండియా కూటమిలో విభేదాలను సృష్టించింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ఆప్, కాంగ్రెస్ మధ్య పొగడం లేదు. ఢిల్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని కాదని టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు ఆప్‌కి మద్దతు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. దీంతో ఇండియా కూటమిలో పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఆప్ ఓటమి తర్వాత కూటమి పార్టీలన్నీ ఇద్దరు కలిసి పోటీ చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ వివాదం ముగియక ముందే ఇండియా కూటమిలో మరో ముసలం ఏర్పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో విపక్ష పార్టీలన్నీ ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ పేరుతో కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు ఉన్నాయి. అయితే, గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ, బీజేపీ కూటమి ‘మహాయుతి’ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఎంవీఏ కూటమిలోని ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాని దక్కించుకోలేదు.

Read Also: Bank Loan: లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు..

ఇదిలా ఉంటే, తాజాగా శివసేనను విభజించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, శరద్ పవార్‌లు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. మహారాష్ట్రలో ప్రతిపక్షానికి కేంద్రంగా ఉన్న శరద్ పవార్, ఏక్‌నాథ్ షిండేకి మహద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కార్ అవార్డ్‌ని అందించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం సందర్భంగా షిండేకి పవార్ నుండి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత షిండే మాట్లాడుతూ.. శరద్ పవార్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు.

ఇద్దరి మధ్య పొగడ్తలు ఎంవీఏలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి అసలు రుచించడం లేదు. తమ పార్టీని విభజించి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి పవార్ ఎలా అవార్డు ఇస్తారని ప్రశ్ని్స్తోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దీనిని ‘దళారుల రాజకీయ సమావేశం’’గా పిలిచారు. ఈ విమర్శలపై బీజేపీ నేత షైనా ఎన్సీ మాట్లాడుతూ.. రౌత్ మానసిక సమతుల్యత కోల్పోయారని దుయ్యబట్టారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆర్ఎస్ఎస్ పనితీరుని శరద్ పవార్ ప్రశంసించారు.