Site icon NTV Telugu

Manipur Violence: మణిపూర్‌ హింసాత్మకం.. సహాయం చేయాలంటూ మేరికోమ్ అభ్యర్థన

Manipur

Manipur

Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాకత్మ సంఘటనలతో అట్టుడుకుతోంది. మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇవి నెమ్మదిగా హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ప్రార్థనా మందిరాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు మోహరించాయి. రాజధాని ఇంఫాల్, చూరాచాంద్ పూర్, కాంగ్ పోక్పిలో ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో 4 వేల మందికి ఆశ్రయం కల్పించారు.

Read Also: Sharad Pawar: ప్లాన్ ప్రకారమే శరద్ పవార్ రాజీనామా.. శివసేన పత్రిక సామ్నాలో కీలక వ్యాఖ్యలు..

మనిపూర్ హింసపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఇదిలా ఉంటే సొంత రాష్ట్రం మణిపూర్ లో జరుగుతున్న విధ్వంసం గురించి ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. మా రాష్ట్రం మండిపోతోంది, సహాయం చేయాలని అని ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలను అభ్యర్థించారు.

షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర వర్గమైన మైతై వర్గం డిమాండ్ కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఎటీఎస్యూఎం) చూరాచాంద్ పూర్ జిల్లాలోని తర్బుంగా ప్రాంతంలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. ఎస్టీ హోదా కోసం మైతై వర్గం చేసిన డిమాండ్ కు మణిపూర్ చట్ట సభ్యులు మద్దతు పలికారు. దీంతో ఈ చర్యపై గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాలు రావణ కాష్టంగా మార్చాయి. గిరిజనులు, గిరిజనేతరులు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. మణిపూర్ రాష్ట్రంలోని జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందిన వారే. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతై వర్గానికి అనుమతి లేదు.

Exit mobile version