Reasi Terror Attack: జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో ఆదివారం బస్సుపై ఉగ్రవాద దాడి ఘటనలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనపై ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలపాలను పెంచాలని సూచించారు.
Read Also: UPSC Exam: UPSC అభ్యర్థుల కోసం నమో భారత్ రైలు వేళలు మార్పు..
రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఆదివారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది మరణించగా.. 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. 1995-2005 మధ్యకాలంలో తీవ్రవాద కేంద్రాలుగా ఉన్న అర్నాస్, మహోర్ ప్రాంతాలను కవర్ చేస్తూ ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ దాడిలో ముఖ్యమైన లీడ్స్ బయటపడ్డాయని, దీంట్లో పాలుపంచుకున్న వారిని గుర్తించడం, పట్టుకోవడంలో సాయపడతాయని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
దీని తర్వాత కథువా, దోడా ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కథువా జిల్లాలోని సైదా గ్రామంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంట్‌లో ఒక జవాన్ వీరమరణం పొందారు. దోడాలో ఓ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా అధికారులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం విస్తృత పరిధిలో వేట సాగిస్తున్నారు.