BJP: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. దశాబ్ధంకు పైగా అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరోసారి ఎంపీని కైవసం చేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా.. ప్రజల్ని ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Read Also: Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..! అనుష్క శర్మ బేబీ బంప్ వీడియో వైరల్
తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్రం కోసం తన మేనిఫెస్టోను ప్రకటించింది. విద్యుత్, గ్యాస్ సిలిండర్లతో పాటు రైతులను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 5 ప్రధాన హమీలను ఇచ్చింది.
* రాష్ట్రంలో ప్రతీ ఇంటికి రూ. 100కి 100 యూనిట్ల విద్యుత్ అందించడం.
* ఉజ్వల యోజన, లాడ్లీ బెహనా లబ్ధిదారులకు సిలిండర్ రూ. 450 అందించడంతో పాటు లాడ్లీ బెహనా యోజన కింద అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతీ నెల రూ. 1250 జమ చేస్తామని హామీ ఇచ్చింది.
* పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు కూడా ఉచిత విద్య అందించబడుతుంది.
* రైతుల నుంచి గోధుమలను క్వింటాల్‌కి రూ. 2700, వరిని రూ. 3100 చొప్పున కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చింది.
* ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి రూ. 20,000 కోట్లు పెట్టబడి పెట్టనున్నట్లు బీజేపీ తెలిపింది. ఆస్పత్రులు, ఐసీయూల్లో బెడ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని చెప్పింది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ప్రచార దూకుడును పెంచింది. నవంబర్ 17న పోలింగ్ జరగనుంది, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.