Site icon NTV Telugu

Basant Soren: లో దుస్తులు కొనేందుకు ఢిల్లీకి వెళ్లా.. ముఖ్యమంత్రి సోదరుడు వివాదాస్పద వ్యాఖ్యలు

Jharkhand Cm Brother

Jharkhand Cm Brother

Basant Soren: జార్ఖండ్‌లో ఇప్పటికే తీవ్ర రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొట్టుమిట్టాడుతుండగా.. ప్రస్తుతం అతని తమ్ముడి వల్ల మరో సమస్య మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రి సోదరుడు, దుమ్కా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నోటి దురుసు వల్ల వార్తల్లో నిలిచారు. దుమ్కా జిల్లాలో ఇటీవలి కాలంలో ఘోరాలు పెరిగిపోయాయి. అయితే ఈ ఘటనలు జరిగిన సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లారని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనిపై మండిపడిన బసంత్ సోరెన్ విలేకరులపై నోరుపారేసుకున్నారు. లో దుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లానని వ్యాఖ్యానించారు.

దుమ్కాలో ఇటీవలే 19 ఏళ్ల యువతిపై అదే ప్రాంతానికి చెందిన షారూక్ అనే యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం వెలుగులోకి రావడంతో దుమ్కాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు దుమ్కాలో 144 సెక్షన్ విధించారు.

దుమ్కా జిల్లాలో మరో దారుణం జరిగింది. 14 ఏళ్ల తన కుమార్తెపై అత్యాచారం చేసి ఆపై హత్యచేసి చెట్టుకు వేలాడదీశారని బాధిత బాలిక తల్లి ఆరోపించింది. నిందితుడు అర్మాన్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుడు అయిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుమ్కా జిల్లాలో జరిగిన వరుస ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తగలబడిపోతున్నా ఎమ్మెల్యే బసంత్ సొరేన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఘటన జరిగిన వారం తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో మీడియా ప్రతినిధులపై బసంత్ సొరేన్ అహంకారం ప్రదర్శించారు. ఓట్లు కావాల్సిన సమయంలోనే దర్శనమిచ్చే ప్రజాప్రతినిధులు అదే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం కనిపించరు. దీనిపై ప్రశ్నిస్తే అహంకారం ప్రదర్శిస్తుంటారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి నేతలందరికీ ప్రజలు గుణపాఠం చెబుతారని ప్రతిపక్షాలంటున్నాయి.

బసంత్ సోరెన్ దుమ్కా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్య తర్వాత ఆ నియోజకవర్గం గొడవలతో ఉడుకుతోంది. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సోరెన్ బాలికల కుటుంబాలను కలిశారు. తన ఢిల్లీ పర్యటనకు గల కారణాన్ని మీడియాతో అడిగితే.. ‘లోదుస్తులు అయిపోయాయి’ అని చెప్పారు.”నాకు లోదుస్తులు అయిపోయాయి, వాటిని కొనడానికి నేను ఢిల్లీ వెళ్ళాను, నేను వాటిని అక్కడ నుంచి తెచ్చుకుంటాను,” అతను నవ్వుతూ చెప్పాడు.

Family Planning Operation: మరో మహిళను బలి తీసుకున్న కు. ని. ఆపరేషన్

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేపై విరుచుకుపడుతూ.. ‘పేదలు, గిరిజనుల నాయకుడైన శిబు సోరెన్ కుమారుడు లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లాడు’ అని హిందీలో ట్వీట్ చేశారు. అందుకే ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించలేకపోయారని ఓ బీజేపీ ఎంపీ అన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో విచిత్రమైన వ్యాఖ్యలతో మండిపడ్డారు.

జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి సోరెన్‌ తన పదవిలో ఉండగా.. తనకు మైనింగ్‌ లీజు మంజూరు చేసినందుకు అనర్హత వేటు పడే అవకాశం ఉన్నందున రాజకీయ అశాంతి నెలకొంది. హేమంత్ సోరెన్ అసెంబ్లీలో బలపరీక్షలో విజయం సాధించి, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఇప్పటికీ ఉందని నిరూపించుకున్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే ఎన్నికల సంఘం సిఫార్సులపై చర్య తీసుకోవడంలో గవర్నర్ రమేష్ బయాస్ జాప్యం చేస్తున్నారని సోరెన్ ఆరోపించారు.

Exit mobile version