Pakistan: అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (SCO-CHG) సమావేశానికి భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో నిరసనలకు ప్లాన్ చేశారు.
ఈ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేత నుంచి జైశంకర్‌కి వింత ఆహ్వానం ఒకటి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా చేపట్టిన నిరసనల్లో జైశంకర్ పాల్గొనాలని పీటీఐ నాయకుడు ఒకరు ఆహ్వానం పంపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సలహాదారు ముహమ్మద్ అలీ సైఫ్ శుక్రవారం జియో న్యూస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిరసనలో పాల్గొనవలసిందిగా జైశంకర్‌ని కోరారు.
Read Also: Matka Teaser : మనకు ఏది అవసరమో అదే ధర్మం.. ఆసక్తి రేపుతున్న ‘మట్కా’ టీజర్
మా నిరసనల్లో పాల్గొనడానికి, మా ప్రజలతో మాట్లాడటానికి, పాకిస్తాన్‌లో ప్రతీ ఒక్కరూ కూడా నిరసన తెలిపే హక్కు ఉన్న బలమైన ప్రజాస్వామ్యాన్ని చూడటానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ని ఆహ్వానించాము అని సైఫ్ అన్నారు. తమ పార్టీ నిరసనని చూసి విదేశీ ప్రజలు సంతోషిస్తారని చెప్పారు. ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని, న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఒత్తిడి తేవాలని పీటీఐ నిరసన తెలుపుతోంది. ఏడాదికి పైగా జైలులో ఉన్న తమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే శనివారం డి-చౌక్ వద్ద నిరసన తెలిపేందుకు పిలుపునివ్వడంతో, పాక్ భద్రతాబలగాలు, పాక్ ఆర్మీ ఇస్లామాబాద్‌లో మోహరించాయి. రాబోయే ఎస్‌సీఓ సమ్మిట్ కోసం సైన్యం అక్టోబర్ 5-17 వరకు నగరంలో పాగా వేసింది. వేరే ప్రాంతాల నుంచి నగరానికి రాకుండా ఎంట్రెన్స్, ఎగ్జిట్ మార్గాలను మూసేసింది. మొబైల్ సేవలపై ఆంక్షలు విధించారు.