NTV Telugu Site icon

Imran Khan: “నో-ఫ్లై” లిస్టులో ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ వదిలిపోకుండా చర్యలు..

Imran Khan

Imran Khan

Imran Khan: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచుకు చేరిన పాకిస్తాన్ పరిస్థితి, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతోంది. అక్కడి ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన అరెస్ట్ సమయంలో, ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, క్వెట్టా, పెషావర్ నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆర్మీ కంటోన్మెంట్లే టార్గెట్ గా దాడులు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఉన్నా.. సైన్యమే పరోక్షంగా అధికారం చెలాయిస్తోంది. నెమ్మనెమ్మదిగా అల్లర్లలో పాల్గొన్నవారిని అరెస్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ఆయన పార్టీకి క్రమంగా రాజీనామాలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ బెదిరింపులతో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు దూరం అవుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ విదేశాలకు ప్రయాణించకుండా ‘నో-ఫ్లై’ జాబితాలోకి ఇమ్రాన్ ఖాన్ ను తీసుకువచ్చింది.

Read Also: Reservoir: ఫోన్‌ రిజర్వాయర్‌లో పడిందని.. 1500 ఎకరాలకు సరిపోయే నీటిని తోడేశాడు..

విదేశాల్లో తనకు ఎలాంటి ఆస్తులు, వ్యాపారాలు లేవని, బ్యాంకు అకౌంట్లు లేవని విదేశాలకు వెళ్లే ఆలోచన లేదని, తనను నో ఫ్లై జాబితాలో ఉంచినందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. థాంక్స్ చెప్పారు ఇమ్రాన్ ఖాన్. ఆయన భార్య బుష్రాబీబీ, ఇతర పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి చెందిన పలువురు నేతలు దేశం వదిలి వెళ్లకుండా నిషేధించింది. మే 9న పాకిస్తాన్ లో జరిగిన హింస నేపథ్యంలో పీటీఐ పార్టీపై నిషేధం విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.

పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 600 పీటీఐ నాయకులపై నో-ఫ్లై జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా పీటీఐ పార్టీకి చెందిన వారు దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని వారిని అడ్దుకున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ జాబితాలో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ పేరు కూడా ఉంది. వీరితో పాటు కీలక నేతలైన మురాద్ సయీద్, మలీకా బొఖారీ, ఫవాద్ చౌదరి, హమ్మద్ అజార్, ఖాసిం సూరి, అసద్ ఖైజర్, యాస్మిన్ రషీద్ మరియు మియాన్ అస్లాం ఇక్బాల్ పేర్లు ఉన్నాయి.

Show comments