Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..

  • బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట..
  • నవంబర్ 2 వరకు ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై చర్యలు తీసుకోమన్న ప్రభుత్వం..
Imran Khan

Imran Khan

Bombay High Court: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(SIR)కు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10 ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. దీంతో అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసుల్ని ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి విచారణ జరిగే నవంబర్ 2 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది.

అమెరికా పౌరుడైన ఇమ్రాన్ ఖాన్ నిరసనల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు FRROకు పంపించారు. దీని తర్వాత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 కింద ఇమ్రాన్ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. భారత్‌లో విదేశీయుల ప్రవేశం, దేశం నుంచి నిష్క్రమణ, దేశంలో వారి ఉనికి, కదలికల్ని నియంత్రించడం, పరిమితం చేయడం లేదా నిషేధించేందుకు ప్రభుత్వం సూచనలు, ఆదేశాలు జారీ చేయవచ్చు.