దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ జార్ఖండ్.. దక్షిణ హర్యానా మీదుగా తుఫాను ఏర్పడనుందని.. దీని ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. అలాగే ద్రోణి కారణంగా రుతుపవనాలు కూడా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించాయని తెలిపింది. దక్షిణ గుజరాత్ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వాయువ్య, పశ్చిమ, మధ్య, తూర్పు మరియు దక్షిణ ద్వీపకల్పంలో ఆగస్టు 9 నుంచి 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
వాయువ్య భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్‌ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 10-15 మధ్య హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు.. పంజాబ్ మరియు జమ్మూ-కాశ్మీర్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే మధ్యప్రదేశ్ మరియు కొంకణ్, గోవా వంటి ప్రాంతాల్లో కూడా ఆగస్టు 9 నుంచి భారీ వర్షపాతంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్రలో కూడా ఆగస్టు 9, 10 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆగస్టు 9-15 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం మరియు జార్ఖండ్‌లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇక దక్షిణ భారత్‌లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్నాటకలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 10 నుంచి 13వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.