Prajwal Revanna’s Father: పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్పబడుతున్న వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు ప్రభావితమయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల తర్వాత ప్రజ్వల్ జర్మనీ పారిపోవడం, ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది.
Read Also: Karnataka: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బూట్లు మాయం.. పోలీసుల గాలింపు
ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు తప్పుచేసినట్లు తేలితే ఉరితీయాలని మంగళవారం అన్నారు. కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్‌ని లక్ష్యంగా చేసుకుంటూ, అతను ఆ పదవికి అన్ ఫిట్ అని అన్నారు. ‘‘నా కొడుకు తప్పు చేస్తే ఉరితీయండి.. నేను దీనికి నో చెప్పను’’ అని అన్నారు. ఈ విషయాన్ని సమర్థించడానికి, చర్చ కోసం ఇక్కడకు రాలేదని, 25 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్నానని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. నాకు వ్యతిరేకంగా కొంతమంది స్త్రీని డీజీపీ ఆఫీసుకు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.
దీనిపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఆయన అధికారులపై ఆరోఫనలు చేస్తున్నారని, ఆయనకు అన్యాయం జరిగితే చర్చకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిని సిట్ విచారిస్తోంది. ఈ వ్యవహారం తర్వాత ప్రజ్వల్‌ని జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.