Site icon NTV Telugu

IAS Officers: ఐఏఎస్‌ ఆఫీసర్లు కావలెను.. దాదాపు 1500 మంది..

Ias Officers

Ias Officers

IAS Officers: మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉండగా అందులో 26 చోట్ల ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌(ఐఏఎస్‌)ల కొరత నెలకొంది. మంజూరైన ఐఏఎస్‌ పోస్టులు 6,789 కాగా ఉన్నది 5,317 మందే. అంటే ఇంకా 1,472 మంది ఐఏఎస్‌లు కావాలి. ప్రజా సేవకులకు (సివిల్‌ సర్వెంట్లకు) శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశం ఒక యూనిక్‌ మోడల్‌ని ఇటీవలే ప్రారంభించింది.

”నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌”(ఎన్‌ఎస్‌సీఎస్‌టీ) పేరిట సరికొత్త నమూనాను ప్రవేశపెట్టి ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఇండియాలో ఐఏఎస్‌ల కొరత నెలకొనటం విచారించాల్సిన విషయమే. 6,789 మందిలో 4,712 మందిని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ద్వారా ప్రత్యక్షంగా నియమించుకోవాలి. మిగిలినవాళ్లను స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ నుంచి ప్రమోషన్లు ఇచ్చి తీసుకోవాలి.

also read: Telangana: ‘కార్మికబంధు’?.. తెలంగాణలో కొత్త పథకం.. నిర్మాణరంగ కార్మికులకు లక్ష బైకులు..!!

ఐఏఎస్‌ ఆఫీసర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతోంది. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలూ మందగిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఐఏఎస్‌ ఆఫీసర్‌ కనీసం రెండు, మూడు శాఖల బాధ్యతలను అదనంగా చూడాల్సి వస్తోంది. దీంతో సమగ్ర సమీక్షలు జరపకుండానే ఫైల్స్‌ని క్లియర్‌ చేయాల్సి వస్తోందని చీఫ్‌ సెక్రెటరీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు.

బాస్వాన్‌ కమిటీ సిఫార్స్‌ల మేరకు 2012 నుంచి ఏటా 180 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లను డైరెక్టుగా నియమించుకుంటున్నామని కేంద్రం చెబుతోంది. అయినా ఖాళీలు ఉండటం గమనార్హం. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ద్వారా 2016 నుంచి 2020 వరకు 898 మంది ఐఏఎస్‌లను నియమించుకున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం ఈ నెల 21న రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపింది.

ప్రస్తుతం ఉన్న 5317 మంది సివిల్‌ సర్వెంట్స్‌లో 3862 మందిని యూపీఎస్సీ ద్వారానే రిక్రూట్‌ చేసుకున్నారు. మిగిలిన 1455 మందిని స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ నుంచి పదోన్నతుల ద్వారా నియమించుకున్నారు. ఇదిలాఉండగా దేశం మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఐఏఎస్‌ల కొరత లేకపోవటం విశేషం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో టాప్‌లో ఉంటున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

Exit mobile version