NTV Telugu Site icon

Anantnag encounter: “నేను బతకకపోవచ్చు, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో”.. చివరిసారిగా భార్యకు వీడియో కాల్..

Humayun Bhatt

Humayun Bhatt

Anantnag encounter: జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. దాదాపుగా 5 రోజులు గడుస్తున్నా.. ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ , జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు. ముగ్గురు ఉన్నతాధికారులు చనిపోవడంతో ఇటు ఆర్మీ, అటు పోలీసులతో పాటు యావత్ దేశ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్ చివరి మాటలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. తాను చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు భార్య ఫాతిమాతో వీడియో కాల్ లో మాట్లాడారు.‘‘ తాను ఇక బతకకపోవచ్చని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని’’ తన కుటుంబానికి వీడియో కాల్ లో చెప్పారు.

Read Also: Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..

హుమాయున్ భట్ తన మ్యారేజ్ అనివర్సరీకి రెండు వారాల ముందు వీరమరణం పొందారు. తనకు కొడుకు జన్మించి కేవలం కొన్ని రోజుల మాత్రమే అయ్యాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్..నేను ఇక బతకను, నా గాయాలకు లొంగిపోతే, మా కొడుకును జాగ్రత్తగా చూసకోండి అంటూ తన భార్య ఫాతిమాతో మాట్లాడటం అందర్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి.

తాను ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి భట్ తండ్రితో మాట్లాడానని, మా రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయని, అతడిని కొండపై నుంచి కిందికి దించుతున్నామని, మేం ఏం చేస్తున్నామో అన్నింటిని భట్ తండ్రికి చూపించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. విపరీతమైన రక్తస్రావంతో డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు.

భట్ తండ్రి కూడా గతంలో జమ్మూకాశ్మీర్ పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేశారు. లష్కరేతోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఎలాగైనా తుదముట్టించాలని భద్రతబలగాలు కోకెర్ నాగ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.