Site icon NTV Telugu

West Bengal: హిందీ మాట్లాడే ఓటర్లే లక్ష్యం?.. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ.. బెంగాల్ SIR డ్రాఫ్ట్‌పై రాజకీయ దుమారం

Bengal

Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియ తొలి దశను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రాజకీయ చర్చకు దారి తీసింది. డ్రాఫ్ట్ ప్రకారం, గతంలో 7.66 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 7.08 కోట్లకు తగ్గిపోయింది. అంటే మొత్తం 58 లక్షల 20 వేల 898 మంది పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడ్డాయి. ఇక, ఓటర్ల పేర్లు తొలగించడానికి ప్రధాన కారణాలను ఎన్నికల సంఘం తెలియజేసింది. ముఖ్యంగా చనిపోయిన ఓటర్లు, శాశ్వత వలసలు, ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉండటం వంటిని పరిగణలోకి తీసుకుని సర్వే చేసినట్లు పేర్కొనింది. అయితే, ఇది తుది జాబితా కాదని, పిటిషన్లు–అభ్యంతరాల ప్రక్రియ పూర్తయ్యాక మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Read Also: CM Chandrababu Delhi visit: మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పోలవరంతో పాటు కొత్త ప్రాజెక్టులపై ఫోకస్‌..

ఇక, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. తొలగించబడిన పేర్లలో ఎక్కువగా హిందీ మాట్లాడే ఓటర్లు ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. హిందీ భాష మాట్లాడే జనాభా అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల పేర్లు ఎక్కువగా తొలగించబడ్డాయి.. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో తొలగింపుల శాతం చాలా తక్కువగా ఉందని పేర్కొనింది. ఇక, కోల్‌కాతా నగరంతో పాటు దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కోల్‌కాతా ఉత్తర జిల్లాలో 25.92 శాతం, కోల్‌కాతా దక్షిణ జిల్లాలో 23.82 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. జోరాసాంకోలో 36.66 శాతం, చౌరంగీ 35.45 శాతం, హౌరా నార్త్ లో 26.89 శాతం, కోల్‌కాతా పోర్ట్‌లో 26.09 శాతం, మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌లో 21.55 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఈ నియోజకవర్గాల్లో హిందీ మాట్లాడే ఓటర్లు ఎక్కువగా ఉండటం, అలాగే బీజేపీకి ఇక్కడ బలమైన రాజకీయ పట్టు ఉండటం గమనార్హం.

Read Also: Madhavan : మాధవన్ కెరీర్‌లో ఈ ఇయర్ చాలా స్పెషల్.. ఎందుకంటే?

అయితే, బీజేపీకి కీలకంగా భావించే మతువా సమాజం కూడా ఈ ప్రక్రియలో ప్రభావితమైంది. మతువా జనాభా అధికంగా ఉన్న దక్షిణ 24 పరగణాల కస్బాలో 17.95 శాతం, సోనారపూర్ దక్షిణంలో 11.29 శాతం, ఉత్తర 24 పరగణాల బన్గావ్ ఉత్తరంలో 9.71 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. హిందీ భాష మాట్లాడే ఓటర్లు, మతువా సమాజం కమలం పార్టీకి ప్రధాన ఓటుబ్యాంక్‌గా భావించబడుతుంది. ఈ నేపథ్యంలో తాజా తొలగింపుతో పార్టీకి రాజకీయంగా ఆందోళన మొదలైంది. ఇక, బెంగాల్‌లో చాలా కాలంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు నివసిస్తున్నారు. SIR ప్రక్రియలో భాగంగా కొందరు తమ సొంత రాష్ట్రాల్లోనే ఓటర్‌గా ఉండటాన్ని ఎంచుకుని ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కువ పేర్లు తొలగించబడినట్లు అంచనా వేస్తున్నారు.

Read Also: Nitish Kumar: క్షమాపణ చెప్పు లేదంటే చంపేస్తా.. హిజాబ్‌పై నితీష్‌కు పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్

మరోవైపు, ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపులు చాలా తక్కువగా ఉన్నాయి. 2011 జనగణన ప్రకారం ముర్షిదాబాద్‌లో 66.3 శాతం, మాల్దాలో 51.6 శాతం ముస్లిం జనాభా ఉంది. అయితే, ముర్షిదాబాద్‌లో కేవలం 4.84 శాతం, మాల్దాలో 6.31 శాతం మాత్రమే ఓటర్ల పేర్లు తొలగించారు. ఏ ముస్లిం ప్రాబల్య నియోజకవర్గంలోనూ 10 శాతం కంటే ఎక్కువ ఓటర్లను తొలగించలేదు. ఈ అంశంపై అధికార టీఎంసీ- బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా బీజేపీ ప్రచారం చేస్తున్న “బెంగాల్‌లో కోటి మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఉన్నారని ఆరోపణలను ఖండించిందన్నారు. ఎన్నికల సంఘం ప్రకారం కేవలం 1.83 లక్షల నకిలీ ఓటర్లు మాత్రమే గుర్తించబడ్డారని తెలిపారు. బీజేపీ ప్రజలతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: Andhra Pradesh: 5 జిల్లాలకు ఇంఛార్జ్‌లుగా సీనియర్‌ ఐఏఎస్‌లు.. ఉత్తర్వులు జారీ

కాగా, బీజేపీ నేతలు ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. టీఎంసీ ఒత్తిడితోనే బూత్ లెవల్ అధికారులు స్వేచ్ఛగా పని చేయలేకపోయారని కమలం పార్టీ నేత రాహుల్ సిన్హా ఆరోపించారు. రాష్ట్ర పరిపాలన జోక్యంతోనే SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష నేత సుభేందు అధికారి అన్నారు. ఈ విషయంపై బీజేపీ ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా, పశ్చిమ బెంగాల్‌లో SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

Exit mobile version