CM Chandrababu Delhi visit: మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు ఆయన ఢిల్లీకి వెళ్లనుండగా, ఈ పర్యటనలో కీలక అంశాలపై కేంద్రంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు నల్లమల్ల సాగర్ వంటి కొత్త నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రాన్ని కోరనున్నారని తెలిసింది. అలాగే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అనుమతులపై చర్చలు జరపనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి వీఆర్ పాటిల్‌ను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఈ భేటీ కీలకంగా మారనుంది. అదే సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్న సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై వ్యూహం రచించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా పోలవరం ప్రాజెక్టుకు వేగం రావడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.