Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.
ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ ఆర్థిక వృద్ధికి వసతి, స్థానిక హోటల్లు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక బస ఏర్పాట్ల ద్వారా రూ. 40,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని చెప్పింది. మతపరమైన కార్యక్రమాల కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ. 5000 ఖర్చు పెడతారని అంచనా. ఇలా మొత్తం ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు మించి ఉంటుందని పేర్కొంది. హోటల్లు, వసతి సౌకర్యాలతో పాటు ఫుడ్, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలు ఈ ఆదయానికి ఊతమిస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్‌లు, మీల్స్‌తో సహా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగం మొత్తం వాణిజ్యానికి రూ.20,000 కోట్లు జోడించగలదని అంచనా. నూనె, దీపాలు, గంగా జలం, మతపరమైన పుస్తకాలు మరో రూ. 20,000 కోట్లను ఆర్జిస్తాయి. టూర్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాలు వంటి పర్యాటక సేవలు మరో రూ. 10,000 కోట్లను అందించే అవకాశం ఉంది.
తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు మరియు మందులు రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని తీసుకురావచ్చు, ఇ-టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వై-ఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు వంటి రంగాలలో రూ. 1,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రకటనలు మరియు ప్రచార కార్యకలాపాలు సహా వినోదం, మీడియా 10,000 కోట్ల రూపాయల వాణిజ్యాన్ని ఆర్జిస్తాయని అంచనా. స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఉత్తర్ ప్రదేశ్ ఈ మహా కుంభమేళా ప్రాముఖ్యాన్ని హైలెట్ చేసింది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించింది.