NTV Telugu Site icon

Wayanad landslides: వయనాడ్ బాధితుల కష్టాలు విని చలించిన ప్రధాని మోడీ

Pmmodi

Pmmodi

ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శనివారం వయనాడ్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. కొండచరియలు విరిగిపడి కొట్టుకుపోయిన గ్రామాలను, పరిసరాలను మోడీ కలియ తిరిగి చూశారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దెబ్బతిన్న ప్రభుత్వ జీవీహెచ్‌ఎస్‌ పాఠశాలను సందర్శించారు. పిల్లలను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను చూసి మోడీ చలించిపోయారు. ఈ స్కూల్‌లో 582 మంది విద్యార్థులు ఉండగా అందులో 27 మంది విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. దాదాపు పాఠశాలలో 15 నిమిషాల పాటు ప్రధాని మోడీ గడిపారు. అలాగే కొత్త పాఠశాల భవనానికి సంబంధించిన ప్రణాళికలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుల పునరావాస కేంద్రాన్ని, ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితుల్ని ప్రధాని పరామర్శించారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేంద్రమంత్రి సురేష్ గోపి, అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?

భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను ప్రధాని మోడీ సందర్శించారు. దాని గుండా నడిచి రక్షణ అధికారులతో సంభాషించారు. పర్యటన అనంతరం వయనాడ్ పరిస్థితిపై మోడీ సమీక్షించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేరళ ప్రభుత్వం విపత్తు ప్రభావిత ప్రాంతంలో పునరావాసం మరియు సహాయక చర్యల కోసం రూ. 2,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జూలై 30న వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 416 మంది మరణించారు. 150 మందికి పైగా తప్పిపోయారు.

 

Show comments