NTV Telugu Site icon

Buffalo Solved Problem: బర్రె పంచాయితీని బర్రే.. తేల్చేసింది.. ఎలాగంటే?

Buffalo

Buffalo

Buffalo Solved Problem: ఓ బర్రె తన యజమాని వివాదాన్ని పరిష్కరించింది. పంచాయితీ పెద్ద మనుషులు, స్థానిక పోలీసులు తేల్చలేకపోయిన పంచాయితీని బర్రె తేల్చింది. ఇది వింతగా అనిపించినప్పటికీ నిజంగానే జరిగింది. తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనదని ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు. వారిద్దరి మధ్య గొడవ తేలకపోవడంతో పంచాయితీ పెద్దల వద్దకు వెళ్లారు. పంచాయితీ పెద్దల వద్ద పరిష్కారం లభించకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీనిని తేల్చలేక చేతులెత్తేశారు. దీంతో ఇక లాభం లేదనుకొని బర్రెకే నిర్ణయం వదిలేయగా.. ఆ బర్రె అసలు యజమానిని గుర్తించి అతడి ఇంటికి చేరడంతో సమస్యకు పరిష్కారం లభించింది.

Read Also: Falaknuma Express: వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..

అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా మహేశ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అక్షరాంపూర్‌ గ్రామంలో నందలాల్‌ సరోజ్‌కు చెందిన బర్రె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పొరుగున ఉన్న పూరే హరికేశ్‌ గ్రామానికి చేరింది. ఆ గ్రామానికి చెందిన హనుమాన్‌ ఆ బర్రెను కట్టేశాడు. నందలాల్‌ ఎంత వెతికినా బర్రె ఆచూకీ దొరకలేదు. చివరికి హరికేశ్ గ్రామంలో హనుమాన్‌ వద్ద ఉందని తెలిసి, అక్కడికి వెళ్లి అడగ్గా ఆ బర్రె తనదేనని వాదించాడు. దాంతో హనుమాన్‌ను నందలాల్‌ రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయితీకి పిలిపించాడు. తప్పిపోయిన బర్రె తనదంటే తనదని ఇద్దరూ వాదులాడుకోగా.. ఏం చేయాలో పాలుపోకపోవటంతో పంచాయితీ పెద్దల సూచన మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ఈ వివాదం తేలలేదు.

ఏం చేయాలో పాలుపోకపోవడంతో పోలీసు అధికారి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ బర్రెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టి, ఆ బర్రె ఏ యజమాని చెంతకు చేరితే వారే అసలైన యజమాని అని ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ ఒప్పుకున్నారు. దాంతో బర్రెను రెండు ఊళ్ల మధ్య వదిలేశారు. ఆ బర్రె నేరుగా అక్షరాంపూర్‌ గ్రామంలోని నందలాల్‌ సరోజ్‌ ఇంటికి వెళ్లింది. దాంతో ఆ బర్రె నందలాల్‌దే అని నిర్ధారణకు వచ్చారు. తప్పుడు కేసు పెట్టి సమయాన్ని వృథా చేసినందుకు హనుమాన్‌ను హెచ్చరించి వదిలేశారు. పంచాయితీ పెద్దలు కూడా అతడిని మందలించారు.

Show comments