Honeymoon Murder Case: గత కొన్ని రోజులుగా హనీమూన్ మర్డర్, సోనమ్ రఘువంశీ దారుణం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరులో మేఘాలయకు తీసుకెళ్లి హతమార్చింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఈ క్రూరమైన ప్లాన్‌ని అమలు చేసింది. రాజను హత్య చేయడానికి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నిందితులు నియమించుకున్నారు. మే 23న రాజా మిస్సింగ్ ఘటన వెలుగులోకి రాగా, జూన్ 02న ఆయన మృతదేహాన్ని ఖాసీ కొండల్లో గుర్తించారు. దీని తర్వాత, జూన్ 08న నిందితురాలు సోనమ్ యూపీ పోలీసులు ముందు లొంగిపోవడంతో ఈ మొత్తం మర్డర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది.
అయితే, నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని నాలుగో ప్రయత్నంలో హత్య చేసినట్లు నిందితులు చెప్పారని ఎస్పీ వివేక్ సయీమ్ చెప్పారు. మొదటి ప్రయత్నంలో గౌహతిలో హత్య చేయాలని చూశారని, ఆ తర్వాత మేఘాలయలోని సోహ్రాలో మరో రెండుసార్లు చంపేందుకు విఫలయత్నం చేశారు. చివరకు నాలుగో ప్రయత్నంలో మేఘాలయలోని వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద చంపారని వెల్లడించారు.
గౌహతిలో వారు చంపాలనుకున్నారని, మృతదేహాన్ని వదిలించుకోవాలని అనుకున్నారు, అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. మరోసారి నోంగ్రియాట్‌లో రాజాను హత్య చేయాలని అనుకున్నప్పటికీ, మృతదేహాన్ని పారేసేందుకు చోటు దొరక్కపోవడంతో ఆగిపోయారు. రాజా వాష్ రూంకు వెళ్లినప్పుడు మావ్లాఖియాట్-వీసావ్‌డాంగ్ మధ్య హత్య చేయాలని భావించి విఫలమయ్యారు. చివరకు వీసావ్ డాంగ్ వద్ద హత్య చేశారు.