NTV Telugu Site icon

RSS: “స్వలింగ సంపర్కం ఓ రోగం”.. చట్టబద్ధం అయితే సమాజంలో పెరుగుతుంది..

Same Gender Marriage

Same Gender Marriage

RSS: సుప్రీంకోర్టులో ప్రస్తుతం స్వలింగ వివాహాల చట్టబద్ధతపై విచారణ కొనసాగుతోంది. దీన్ని కేంద్రంతో పాటు సమాజంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇది కేవలం అర్బన్ కమ్యూనిటీలో కొంతమందికి మాత్రమే పరిమితం అయిందని, దేశంలో మెజారిటీ ప్రజల మనోభావం కాదని, చట్టబద్ధత కల్పించే హక్కు పార్లమెంట్ ది అని దీంటో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం తెలిపింది. అయితే వీరి హక్కులపై ఓ కమిటీని నియమిస్తామని ఇటీవల కేంద్ర అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

ఇదిలా ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళా విభాగం సంవర్ధిని న్యాస్ ఈ అంశంపై సర్వే చేసింది. స్వలింగ సంపర్కం అనేది ఒక రుగ్మత అని, దీనికి చట్టబద్ధత లభిస్తే సమాజంలో మరింతగా పెరుగుతుందని పలువురు వైద్యులు విశ్వసిస్తున్నారని ఆ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆధునిక వైద్యం నుంచి ఆయుర్వేద వరకు 8 విభిన్నమైన చికిత్స విధానాలకు చెందిన 318 మంది వైద్య ప్రముఖుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగినట్లు తెలిపారు.

Read Also: Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు

దాదాపుగా 70 శాతం మంది వైద్యులు, అనుబంధ వైద్య నిపుణులు ‘‘స్వలింగ సంపర్కం ఒక రుగ్మత’’ అని పేర్కొన్నారు. వారిలో 83 శాతం మంది స్వలింగ సంపర్కం లైంగిక వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతుందని ధృవీకరించినట్లు సర్వేలో తేలింది. సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్టబద్ధం చేయాలనే నిర్ణయం రోగులను నయం చేయడం, వారిని సాధారణ స్థితికి తీసుకురావడం కన్నా సమాజంలో ఈ రుగ్మతను ప్రోత్సహిస్తుందని ఆర్ఎస్ఎస్ తెలిపింది. అటువంటి మానసిక రుగ్మత ఉన్న రోగులను నయం చేయడానికి కౌన్సిలింగ్ ఉత్తమ ఎంపిక అని తెలిపింది.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్ పై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని సవర్థిని న్యాస్ సర్వే సిఫార్సు చేసింది. 67 శాతం మంది వైద్యులు చెప్పిన దాని ప్రకారం స్వలింగ సంపర్కులు తమ సంతానాన్ని సరిగ్గా పెంచలేరని భావించినట్లు తేల్చింది. ప్రస్తుతం స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. 57 శాతం మంది వైద్యులు ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని తిరస్కరించినట్లు సర్వే తేల్చినట్లు సంవర్థిని న్యాస్ తెలిపింది.

Show comments