NTV Telugu Site icon

Hoax bomb threat: విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు.. నకిలీ బాంబు బెదిరింపులపై కీలక నిర్ణయం..!

Bomb Threats

Bomb Threats

Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది.

Read Also: Canadian Sikh MP: భారత్‌పై ఆంక్షలు, ఆర్ఎస్ఎస్‌పై బ్యాన్.. కెనడియన్ సిక్కు ఎంపీ కామెడీ..

ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర పౌరవిమానయాన అధికారులు అత్యున్న సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు భేటీలో పాల్గొన్నారు. సమాచారం ప్రకారం.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ బూటకపు కాలర్లను గుర్తించి వీరిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చేందుకు సమాయత్తమవుతోంది. ఇదే విధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయడంపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్ఎస్‌జీ కమాండో యూనిట్ ఎయిర్ మార్షల్స్‌ని ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, దేశీయంగా సున్నితమైన మార్గాల్లో మోహరించనున్నారు. స్కై మార్షల్స్ సాధారణ ప్రయాణికుల వలే విమానంలో ప్రయాణించే సాయుధ భద్రతా అధికారులు.

బాంబు బెదిరింపులపై నివేదిక సమర్పించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. భారతదేశ విమానరంగానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుస్తోంది.