Controversy: ఇటీవల కోల్‌కతాలో మహాత్మా గాంధీ పోలికలతో మహిషాసుర విగ్రహాన్ని దుర్గామండపం వద్ద ప్రతిష్ఠించి వివాదం సృష్టించిన హిందూ మహాసభ తాజాగా మరో వివాదానికి తెరతీసింది. కరెన్సీ నోట్లపై గాంధీ స్థానంలో సుభాష్ చంద్రబోస్ బొమ్మను పెట్టాలని డిమాండ్ చేసింది. దేశానికి స్వాతంత్య్ర సాధన పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన సేవలు మహాత్మాగాంధీ కంటే ఎంత మాత్రం తక్కువ కాదని హిందూ మహాసభ పేర్కొంది. కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ముద్రించడమే దేశానికి స్వాతంత్ర్యం సాధించిన గొప్ప పోరాట యోధుడిని గౌరవించే గొప్ప మార్గమని అభిప్రాయపడింది.
Read Also: ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి..
అటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీహెచ్ఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫోటో స్థానంలో నేతాజీ చిత్రాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అటు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధిర్ చౌదరి ఈ విషయంపై స్పందించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ పాత్ర కాదనలేనిదని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ హత్య వెనుక ఎవరు ఉన్నారన్నది దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు గాంధీ ఆశయాలు, సూత్రాలను కొందరు పనిగట్టుకుని హననం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలని ఆధిర్ చౌదరి డిమాండ్ చేశారు.