Chandra Arya: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ హత్య నేపథ్యంలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కెనడాలోని హిందువులను టార్గెట్ చేస్తూ, కెనడా వదిలిపెట్టి భారత్ వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కెనడాలో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీలో ఎంపీగా ఉన్న చంద్ర ఆర్య తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఖలిస్తానీ ఉగ్రమూకాల హెచ్చరికలతో హిందూ కెనడియన్లు భయపడుతున్నారని ఆయన ఆదివారం అన్నారు.
జస్టిన్ ట్రూడో ప్రకటన తర్వాత ఏం జరుగుతుందో అని నేను మరింత ఆందోళన చెందుతున్నట్లు ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కెనడాలో జాతి, మతపరైమన రక్తపాతం నిజమే అని ఆయన పేర్కొన్నారు. కెనడాలో హిందువులు భయపడటానికి మూడు కారణాలను చంద్ర ఆర్య పేర్కొన్నారు.
Read Also: FBI: “మీ ప్రాణాలు జాగ్రత్త”.. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీలకు ఎఫ్‌బీఐ వార్నింగ్
1) ఖలిస్తాన్ హింస, చరిత్ర అంతా రక్తపాతమే అని, ఖలిస్తాన్ ఉద్యమ చరిత్రలో హిందువులు, సిక్కులు 10 వేల మంది మరణించారని చంద్ర ఆర్య అన్నారు. 38 ఏళ్ల క్రితం కెనడా నుంచి ఇండియాకు వెళ్తున్న ఎయిర్ ఇండియా బాంబు దాడి, 9/11 ఉగ్రఘటనకు ముందు జరిగిన అతిపెద్ద విమానయాన ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ ఇండియా దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఇంకా పూజించడం వాస్తమే అని ఆయన అన్నారు.
2) మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన విధానాన్ని కెనడాలో ఓ ర్యాలీలో శకటంపై ప్రదర్శించడాన్ని చంద్ర ఆర్య ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రధానిగా ఉన్న వ్యక్తి హత్యను బహిరంగంగా ప్రదర్శించడం, సంబరాలు చేసుకోవడం స్వేచ్ఛ పేరుతో ఏ దేశం అనుమతిస్తుందో చెప్పండి అంటూ ప్రశ్నించారు.
3) గురుపత్వంత్ సింగ్ పన్నూ హిందూ కెనడియన్లను దేశం విడిచి భారత్ వెళ్లాలని బెదిరించాడు. ఈ రకమైన పరిణామాలు బహిరంగంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది సిక్కు-కెనడియన్లు ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదని, హిందూ కెనడియన్లతో సన్నిహితంగా ఉన్నారని లిబరల్ పార్టీ నేత చంద్ర ఆర్య అన్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లడకపోవచ్చని, వారు హిందూ కెనడియన్లుతో సంబంధాలు కూడా ఉన్నాయని అన్నారు.