DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
డీఎంకే ఎంపీ దయానిధి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాల స్పందించారు. యూపీ, బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలను దుయ్యబట్టారు. డీఎంకే నేతలు బీహార్ ప్రజలను అవమానపరచడం మానేయాలని బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇండియా కూటమిలోని నేత, సీఎం నితీష్ కుమార్ వల్లే.. బీహార్ ప్రజలు తమిళనాడు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు ప్రజల్ని కులం, భాష, మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని పూనావాల ఆరోపించారు. డీఎంకే వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రశ్నించారు.
Read Also: WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త పాలక వర్గం సస్పెండ్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకున్న వారితో హిందీ మాట్లాడే వారిని పోల్చుతూ.. ఇంగ్లీష్ మాట్లాడేవారు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ, లక్షలు సంపాదిస్తున్నారని, హిందీ మాట్లాడే బీహార్, యూపీ వాళ్ల తమిళనాడులో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా కూడా తప్పుపట్టాల్సిందే అని అన్నారు. ఈ దేశమంతా ఒక్కటే అని ఇతర రాష్ట్రాలను గౌరవించాలని అన్నారు.
అంతకుముందు 5 రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన తర్వాత డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గోమూత్ర రాష్ట్రాల్లో గెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పారు. అంతకుముందు డీఎంకే కీలక నేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదం అయింది.
