Site icon NTV Telugu

MK Stalin: హిందీ జాతీయ భాష కాదు.. తమిళ మహిళపై వేధింపుల తర్వాత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

Mk Stakin

Mk Stakin

తమిళనాడులో హిందీ భాష మరోసారి వివాదంగా మారింది. గోవా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది, హిందీ రాకపోవడంతో ఓ తమిళ యువతిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. హిందీ భారతదేశ జాతీయభాష కాదని, ప్రజలు బలవంతంగా దీనిని నమ్మేలా చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

హిందీయేతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు హిందీ తెలియనందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్న సంఘటలు ఆందోళన కలిగిస్తున్నాయని, హిందీ భారతదేశ జాతీయ భాష అనే విధంగా తప్పుదారి పట్టించేలా బలవంతం చేస్తున్నారని స్టాలిన్ ట్వీట్ చేశారు.

Read Also: Medical Miracle: వైద్యశాస్త్రంలోనే అద్భుతం.. వైద్యపరంగా చనిపోయి, మళ్లీ బతికిన మహిళ..

ఇటీవల గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న తమిళ మహిళా ఇంజనీర్ షర్మిల ఘటనపై తమిళనాడు సీఎం స్పందించారు. తనకు హిందీ తెలియదని సీఐఎస్ఎఫ్ అధికారి తనను అవమానించారని షర్మిల ఆరోపించింది. తమిళనాడు కూడా ఇండియాలోనే ఉందని, ప్రతీ ఒక్కరూ హిందీని నేర్చుకోవాలని సదరు అధికారి తనను కోరినట్లు చెప్పింది. హిందీ జాతీయభాష కాదని షర్మిల వివరణ ఇచ్చినప్పటికీ.. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ గార్డు భారత్ లోని ప్రతీ ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని బిగ్గరగా అరవడం ద్వారా తనను అవమానించారని ఆరోపించారు.

దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. భద్రతాను కాపాడటం వారి పని అని, హిందీ పాఠాలు నేర్పడం కాదని అన్నారు. హిందీ విధింపుపై, సదరు భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

Exit mobile version