MK Stalin: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ‘‘హిందీ’’ వివాదం ముదురుతోంది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ విమర్శిస్తున్నారు. తమ రాష్ట్రంలో తమిళ, ఇంగ్లీష్ కలిగిన ‘‘ద్విభాషా విధానం’’కి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అయితే, ఎంకే స్టాలిన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తోంది. అన్ని భాషల్ని ఇష్టపూర్వకంగా నేర్చుకునే హక్కు అందరికి ఉంటుందని చెబుతోంది.
Read Also: Russia: భార్యకు నచ్చలేదని లగ్జరీ కారును డంపింగ్‌లో పడేసిన భర్త
తాజాగా, గురువారం ఎంకే స్టాలిన్ మరోసారి హిందీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలు బలవంతంగా హిందీని స్వీకరించడం వల్ల ‘‘100 ఏళ్లలో 25 స్థానిక ఉత్తరాది భాషల్ని హిందీ నాశనం చేసింది’’ అని ఆరోపించారు. బీజేపీ స్టాలిన్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది. హిందీ గుర్తింపు కోసం ప్రాచీన భాషల్ని చంపుతోందని, యూపీ, బీహార్‌లు ఎప్పుడూ ‘‘హిందీ హార్ట్ ల్యాండ్ ప్రాంతాలు’’ కావు అని అన్నారు. హిందీ ఉత్తర్ ప్రదేశ్ మాతృ భాష కాదని, యూపీ భోజ్‌పురి, బుందేల్ ఖండిలను కోల్పోయిందని స్టాలిన్ అన్నారు. ఉత్తరాఖండ్ కుమావోనీని కోల్పోయిందని, రాజస్థాన్, హర్యానా, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లు తమ స్థానిక భాషలను కోల్పోయాయని స్టాలిన్ ఆరోపించారు.
ప్రస్తుతం, హిందీ వివాదం కేంద్రం, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదాలకు కారణమైంది. డీఎంకే నేతలతో పాటు పలు తమిళ నాయకులు కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే, తమిళనాడు మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇటీవల స్టాలిన్ ప్రకటించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..ఏ రాష్ట్రంపై ఏ భాషను రద్దే ప్రయత్నం తాము చేయడం లేదని చెప్పారు. మరోవైపు సినీ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.