MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రి భాషా విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. NEP అమలు చేస్తే తమ రాష్ట్రం 2000 ఏళ్లు తిరోగమనం చెందుతుందని అన్నారు. దీనిని పాపం అంటూ పిలిచారు. కేంద్రం రూ. 10,000 కోట్లు ఇచ్చినా తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని చెప్పారు.
త్రిభాషా విధానం ద్వారా హిందీని తమ రాష్ట్రంలో అమలు పరిచేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రయత్నిస్తున్నారని అంతకుముందు స్టాలిన్ విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రాన్ని లక్ష్యం చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 8 కోట్ల మంది మాట్లాడే తమిళ భాషాభివృద్ధికి కేవలం 74 కోట్లు మాత్రమే కేటాయించారని, కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడే సంస్కృతానికి రూ.1,488 కోట్లు కేటాయించారని అన్నారు.
Read Also: Mangalyaan-2: ఇస్రో ‘‘మంగళయాన్-2’’.. ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్..
కేంద్రం తమిళభాష, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామని చెబుతూ, సంస్కృతాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. NEP అమలుపై కేంద్రం, తమిళనాడు మధ్య విభేదాలు ఉన్నాయి. కీలక పథకాలకు నిధులను నిలిపేసిందని కేంద్రంపై డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు సీఎం తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు తమిళం, ఇంగ్లీష్ భాషల ‘‘రెండు భాషల విధానాన్ని’’ మాత్రమే అనుసరిస్తుందని చెప్పారు.
అంతకుముందు.. కేంద్రం అమలు చేస్తున్న రెండు పథకాలు – సమగ్ర శిక్షా అభియాన్ (SSA) మరియు PM SHRI పాఠశాలలు – NEP తో అనుసంధానించడం ప్రాథమికంగా ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి పేర్కొంటూ స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా భాషా వివాదంలో చేరారు. ‘‘ఒక భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. వాటితో ఆడుకోకండి. తమిళులకు, పిల్లలకు కూడా వారికి ఏ భాష అవసరమో తెలుసు. వారికి ఏ భాష కావాలో ఎంచుకునే జ్ఞానం వారికి ఉంది” అని శుక్రవారం తన మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం) పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన అన్నారు.