Himanta Biswa Sarma: కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య విభేదాలు ఉన్నాయని అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. దావోస్ పర్యటనలో గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. గతంలో వీరిద్దరి మధ్య అంతర్గత పోరాటానికి తాను బాధితుడిని అయ్యానని చెప్పారు. ప్రస్తుతం, అస్సాం ఎన్నికల కమిటీని ప్రియాంకా గాంధీ సారధ్యం వహిస్తున్నారు. దీనిపై హిమంత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేరళ విషయాల్లో ప్రియాంకా జోక్యాన్ని రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని అన్నారు.
Read Also: Pakistan: ఇంతకన్నా దరిద్రం ఉంటుందా.. ‘‘గాజా పీస్ బోర్డు’’లో పాక్ చేరికపై సెటైర్లు..
‘‘కేరళలో ప్రియాంక ఉండటం రాహుల్‌కు ఇష్టం లేదు. నేను 22 సంవత్సరాలు కాంగ్రెస్‌లో ఉన్నాను. నాకు అంతర్గత సమాచారం ఉంది. రాహుల్ కేసీ వేణుగోపాల్ వర్గాన్ని, తన వర్గాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ప్రియాంక ఆ వర్గాలకు బయటి వ్యక్తి. అందుకే అతను ఆమెను అస్సాంకు బదిలీ చేశాడు. కేరళకు చెందిన ఒక ఎంపీకి కేరళలో బాధ్యతలు అప్పగించలేదు. దీన్ని మీరు ఇంకెలా అర్థం చేసుకుంటారు?’’ అని అన్నారు. గాంధీ కుటుంబాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ కుటుంబం అని విమర్శించారు. తన కుటుంబం గాంధీ కుటుంబాని కన్నా ఉత్తమమైందని, మేము కష్టపడి పెరిగామని చెప్పారు.
భారత్ ఒక విభిన్నమైందని, మనం ప్రతీ రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఒక ప్రాంతం కేవలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా అభివృద్ధి చెంది, మరో వైపు ఏం లేకపోతే దేశం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అస్సాం ఒక కీలకమైన రాష్ట్రమని, ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నప్పటికీ, సవాళ్లు ఉన్నప్పటికీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందని ఆయన అన్నారు. అస్సాంలో జనాభా స్వరూప స్వభావం మార్చడం పెద్ద ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా బంగ్లాదేశీయుల చొరబాట్ల గురించి మాట్లాడారు.
