Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..

  • డీకే శివకుమార్ కాలర్ పట్టి లాగిన రాహుల్ గాంధీ..
  • వైరల్ వీడియోపై అస్సాం సీఎం హిమంత విమర్శలు..
  • రాహుల్‌కు అహంకారమంటూ ఆగ్రహం..
Himata

Himata

Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతలు సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌ను రాహుల్ గాంధీ కాలర్ పట్టి వెనక్కి లాగిన వీడియో వైరల్ అయింది.

దీనిపై బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు. అస్సాం సీఎం హిమంత.. ‘‘డీకే శివకుమార్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, కర్ణాటక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని బహిరంగంగా అవమానించడాన్ని ఆయన ఎలా అంగీకరిస్తారు’’ అని ప్రశ్నించారు. ‘‘2015లో నేను అవమానాన్ని సహించలేదు. గర్వించే అస్సామీగా నా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను. దేవుడు నాకు మేలు చేశారు’’ అని హిమంత ఎక్స్‌లో రాశారు. రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రతిష్టను కొత్తగా చూపించేందుకు ప్రయత్నించినా, ఆయనలో అహంకారాన్ని దాచలేరని విమర్శించారు.

ఇదే వీడియోపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాలను పక్కన పెడితే, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి బహిరంగ అవమానం 7 కోట్ల కన్నడిగుల గౌరవానికి భంగం కలిగించడమే’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనను రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో వీరేంద్ర పాటిల్‌ను కర్ణాటక సీఎం పదవి నుంచి తొలగిస్తున్నట్లు అనాగరికంగా ప్రకటించడంతో పోల్చారు.

2015లో కాంగ్రెస్‌ను వీడిన ఘటనను గుర్తుచేసుకున్న హిమంత..

రాహల్ గాంధీతో తనకు విభేదాలు ఏర్పడిన సంఘటనను హిమంత గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడానికి, అప్పట్లో రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం తన నిర్ణయానికి కారణమైందని పలుమార్లు హిమంత చెప్పారు. 2016లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాహుల్ గాంధీ నివాసంలో అస్సాం కాంగ్రెస్ విభేదాల గురించి చెబుతున్న క్రమంలో, రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కకు ఒక ప్లేట్‌లో బిస్కేట్లు ఇచ్చాడని, అదే ప్లేట్‌లో వచ్చి న నాయకులు కూడా బిస్కెట్లు ఇచ్చారని హిమంత ఆరోపించారు. ఆ తర్వాత నుంచి హిమంత చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు.