Assam: అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ ఘాటుగా స్పందించారు. మీకు తెలియకుంటే మాట్లాడవద్దని హెచ్చరించారు. 1955 పౌరసత్వం చట్టంలోని సెక్షన్ 6ఏ చెల్లుబాటు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తన వాదనలను వినిపిస్తూ కపిల్ సిబల్ అస్సాంపై మాట్లాడారు.
‘‘ మీరు అస్సాం చరిత్రను పరిశీలిస్తే ఎవరు ఎప్పుడు వచ్చారో గుర్తించడం అసాధ్యం, అస్సాం వాస్తవానికి మయన్మార్‌లో ఒక భాగం. 1824లో బ్రిటిష్ వారు ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారికి మయన్మార్ అస్సాంని అప్పగించింది’’ అని అన్నారు. మణిపూర్‌లో మైయిటీలు, కుకీలకు జాతి ఘర్షణల తర్వాత కుకీల తరుపున కూడా కపిల్ సిబలే వాదిస్తున్నారు.
Read Also: BJP: రాహుల్‌గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అస్సాం సీఎం, ఈశాన్య రాష్ట్రాల స్ట్రాటిజస్ట్‌గా పేరున్న హిమంత్ బిస్వ సర్మ, కపిల్ సిబల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘‘ అస్సాం చరిత్ర గురించి అవగాహన లేని వారు మాట్టాడవద్దని, అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. కొంతకాలం దీనిపై గొడవలు జరిగాయి. అంతే తప్పా.. అస్సాం మయన్మార్‌లో భాగమని చెప్పే ఏ సమాచారాన్ని ఇంతవరకు చూడలేదు’’ అని సీఎం హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.