Himanta Biswa Sarma: హిమంత ది అన్‌స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్

  • హిమంత ది అన్‌స్టాపబుల్
  • శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక
  • వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రి
Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

బీజేపీ నాయకుడు డాక్టర్ హిమంత బిస్వా శర్మ అస్సాంలో బీజేపీ, ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హిమంత మే 12న అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం గౌహతిలో జరిగిన ఒక కీలక సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా హిమంత బిస్వా శర్మ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికతో, వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రి అయ్యేందుకు శర్మ మార్గం సుగమమైంది.

ఈ ఉదయం అస్సాం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు హిమంత బిస్వా శర్మ పేరును నాయకుడిగా ప్రతిపాదించారు. ఈ ప్రక్రియ అంతటా జేపీ నడ్డా, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని కేంద్ర పరిశీలకులు, సహ-పరిశీలకులుగా హాజరయ్యారు. కీలక మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) కూడా శర్మ నామినేషన్‌కు పూర్తి మద్దతు తెలిపాయి. అన్ని పార్టీల ఏకాభిప్రాయం తరువాత, ఆయన ఏకగ్రీవంగా ఎన్డీఏ నాయకుడిగా ఎన్నికయ్యారు.

అధికారుల కథనం ప్రకారం, హిమంత బిస్వా శర్మ, ఇతర సీనియర్ ఎన్డీఏ నాయకులు ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలవనున్నారు. ఈ సమావేశంలో వారు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు.