Air India Hijack Threat: టేకాఫ్‌కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!

Vistara

Vistara

Air India Hijack Threat: కోల్‌కతా నుంచి ముంబైకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా (విస్తారా) విమానంలో హైజాక్‌కు సంబంధించిన బెదిరింపు సమాచారం కలకలం రేపింది. టేకాఫ్‌కు ముందే విమానంలో అనుమానాస్పద నోట్ లభించడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందంటూ నోట్‌లో హెచ్చరిక ఉండటంతో వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ దింపివేసి, విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించినట్లు సమాచారం.

హైజాక్ బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని సాధారణ కార్యకలాపాల నుంచి వేరుచేసి ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. అనంతరం విమానంలో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నోట్ ఎవరు పెట్టారు? అందులో కచ్చితంగా ఏమి రాసి ఉంది? అనే విషయాలపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

తాజాగా కోల్‌కతా-ముంబై ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు నోట్ లభించినట్లు వచ్చిన సమాచారం విమాన భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో విమానాశ్రయ అధికారులు, ఎయిర్‌లైన్స్ కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.