NTV Telugu Site icon

Hijab ban row: ఇండియా కూటమికి అధికారం ఇస్తే దేశంలో ఇస్లామిక్ చట్టం తెస్తారు.. హిజాబ్ వివాదంపై బీజేపీ..

Hijab Row

Hijab Row

Hijab ban row: కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం రాజుకుంది. బీజేపీ హయాంలో పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే దుస్తులు ధరించాలని, హిబాబ్‌పై బ్యాన్ విధించింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు కూడా హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి ఆచారం కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, హిజాబ్ బ్యాన్‌ని ఎత్తేసింది.

సీఎం సిద్ధరామయ్య రాష్ట్రంలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తేయడం వల్ల రాష్ట్రంలో షరియా చట్టం ఏర్పడుతుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే దేశవ్యాప్తంగా ఇస్లామిక్ చట్టం అమలులోకి వస్తుందని ఆరోపించారు. ‘‘ఇది కేవలం హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేవేయడమే కాదు, రాష్ట్రంలో షరియా చట్టాన్ని ఏర్పాటు చేయడం, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఇండియా కూటమి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తుంది. సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు’’ అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.

Read Also: Dunki Day 2 Collections : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కలెక్షన్స్ డౌన్.. సలార్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..

సిద్ధరామయ్య ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పొందాలని భావిస్తున్నారని మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల మధ్య విభేదాలు సృ‌ష్టించేందుకు సిద్ధరామయ్య ఇలా చేస్తు్న్నారని ఆరోపించారు. ముస్లింలను సంతృప్తిపరిచేందుకు హిజాబ్‌పై సిద్ధరామయ్య నిషేధాన్ని ఎత్తేశారని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు.

అయితే ఈ చర్య చట్టబద్ధంగా జరుగుతోందని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కాంగ్రెస్, బీజేపీ ఆరోపణల్ని తిప్పికొట్టింది. బీజేపీకి రాజ్యాంగంపై అవగాహన లేదని రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఈ అంశంపై సీఎంతో చర్చించి ముందుకు వెళ్తామని రాష్ట్రమంత్రి మధు బంగారప్ప అన్నారు. మరో మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. సెక్యులర్‌గా ఉండటం బుజ్జగించడమేనా..? అని ప్రశ్నించారు.

Show comments