భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం హై-లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్‌లపై ఎలా స్పందించాలన్న దానిపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత సుంకాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Deva Katta : ‘మయసభ’.. బోలెడన్ని ప్రశంసలు.. కొన్ని విమర్శలు
భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు ప్రకటించారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం పడింది. ఈ ప్రభావం అనేక రంగాల మీద పడనుంది. ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఫుడ్, ఆటో రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇది కూడా చదవండి: Film Workers Strike: నేడు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం.. రేపు తిరిగి చర్చలు ప్రారంభం!
అయితే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. సుంకాలపై భారత్‌తో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. ఓవల్ ఆఫీసులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత చెడిపోతున్నట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు ట్రంప్ టారిఫ్‌లపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. బెదిరింపులకు భారత్ భయపడదని.. టారిఫ్‌లు భరించడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మోడీ తేల్చి చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. భారీ మూల్యం చెల్లించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.
మొత్తానికి ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. శుక్రవారం మధ్యాహ్నం మోడీ అధ్యక్షతన హై లెవల్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ఎలాంటి ప్రకటన రానుందో చూడాలి.
