High Court: కొడుకు తప్పు చేసిన రక్షించే తల్లులను శిక్షించే చట్టాలు లేవని పంజాబ్-హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన కొడుకును రక్షించేందుకు ఆధారాలు నాశనం చేయాలని చూసిన తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడైన కొడుకుకు మరణశిక్షను రద్దు చేసి, జీవితఖైదు (30 సంవత్సరాలు రిమిషన్ లేకుండా), రూ. 30 లక్షల జరిమానాను విధించింది. అదే సమయంలో అతడి తల్లిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
అత్యాచారానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయాలనే ఆందోళనతోనే ఈ హత్య జరిగిందని, ఇది ముందుగా పన్నాగం పన్ని చేసిన చర్య కాదని కోర్టు పేర్కొంది. తీర్పును వెలువరిస్తూ జస్టిస్ అనూప్ చిట్కారా, సుఖ్వీందర్ కౌర్‌లతో కూడిన ధర్మాసనం.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లులు తమ ‘‘ప్రియమైన’’ కుమారుల పట్ల తరుచుగా గుడ్డి ప్రేమ కలిగి ఉంటారని, కొడుకులు దుర్మార్గులైనప్పటికీ వారిని ‘‘రాజా బేటా’’గానే భావిస్తారని వ్యాఖ్యానించింది.
Read Also: China: 2 సెకన్లలో 700 kmph! చైనా కొత్త సూపర్ రైలు చూశారా!
ఈ కేసులో తన కొడుకు ఐదేళ్ల బాలికను క్రూరంగా హత్య చేశాడని తెలుసుకున్న తర్వాత కూడా తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, బాలికకు న్యాయం చేయడానికి బదులుగా కొడుకును రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చిందని కోర్టు పేర్కొంది. ఈ సామాజిక వైఖరి భయంకరమైనది అయినప్పటికీ, కొత్తది కాదని, ఇది పితృస్వామ్య మనస్తత్వం, సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.
2018లో అత్యాచారం, హత్య కేసు, సాక్ష్యాలు నాశనం చేసినందుకు 2020లో ట్రయల్ కోర్టు వీరేందర్ అలియాస్ భోలుకు మరణశిక్ష, అతడి తల్లి కమలాదేవికి కఠిన జైలుశిక్ష విధించింది. భోలు తన యజమాని కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహం నిందితుడి ఇంటి ప్రాంగణంలో లభించింది. ఈ కేసులో నిందితుడికి ముందస్తు నేరచరిత్ర లేకపోవడం, హత్య ముందస్తు ప్రణాళికలో భాగం కాకపోవడం, జైలులో ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని చెబుతూ అతడి మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది.
