PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ మూడు పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులని ఆరోపించారు. జార్ఖండ్‌ని కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం కోరుకుంటోందని ఆయన అన్నారు. అధికార హేమంత్ సొరెన్ పార్టీ జేఎంఎం ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఆదివాసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు, ఇప్పుడు వారి అటవీ భూమిని ఆక్రమించిన వారితో జతకట్టారని జేఎంఎంపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్, జేఎంఎం ‘‘బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారుల’’తో జతకట్టిందని, వీరంతా ఆ పార్టీలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల దృష్టిసారించిన కాంగ్రెస్ దెయ్యం ఇప్పుడు జేఎంఎంని ఆవహించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసినప్పుడల్లా బుజ్జగింపు మాత్రమే ఎజెండా అవుతుందని, దీని వల్ల మొదటగా బాధపడేది దళితులు, గిరిజనులు, వెనకబడిన సమాజ ప్రయోజనాలే అని అన్నారు. అదే ద్రోహం ఇప్పుడు జేఎంఎం చర్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌పై నిందలు వేసిన ప్రధాని, దేశంలో ‘‘అత్యంత నిజాయితీ లేని, అత్యంత అవినీతి పార్టీ’’ గా అభివర్ణించారు. కాంగ్రెస్ కుటుంబాన్ని అవినీతిపరులంట తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేఎంఎం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని చెప్పారు. జేఎంఎం ఐదేళ్లలో జార్ఖండ్‌ని దోచుకోవడంపై మాత్రమే దృష్టిపెట్టిందని దుయ్యబట్టారు. ఏ రంగాన్ని వదలేదని ఆరోపించారు. నీరు, అడవులు, భూమి ఇలా అన్నింటిలో జేఎంఎం అవినీతికి పాల్పడిందని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన ‘ఈ కేసులన్నీ’ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. హామీలు ఇచ్చి అమలు చేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీనే అని ప్రధాని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మాజీ సీఎం, జేఎంఎం కీలక నేత చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరారు. సంతాల్ పరగణాలో ఆదివాసీల భూముల్ని అక్రమ చొరబాటుదారులు చెరబడుతున్నారని అన్నారు.