NTV Telugu Site icon

Bangalore Rain: తడిసి ముద్దయిన బెంగళూరు..ఒక్కరోజే 10 సెంటీమీటర్ల వాన

Rains

Rains

రుతుపవనాలరాకకు ముందే కర్నాటకలో భారీవర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో ఒక్కరోజులో 10 సెంటీమీటర్లకు పైగా వానపడడంతో ముంపులోనే అనేక ప్రాంతాలు వుండిపోయాయి. రెండవ రోజూ సీఎం సందర్శన కొనసాగుతోంది. బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత అతలాకుతలం చేసింది.

మంగళవారం 11.46 సెంటీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మే నెలలో బెంగళూరులో సగటు వర్షపాతం 10.74 సెంటీమీటర్లు కాగా, మంగళవారం రాత్రి ఒక్కరోజులోనే ఆ వర్షం కురవడంతో నగరం తడిసి ముద్దయింది. బెంగళూరులోని హొరమావు ప్రాంతం ఇంకా ముంపులోనే వుంది. ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే వుండిపోయాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడానికి మార్గం లేదు. ఇళ్లు, అపార్టుమెంట్ల చుట్టూ వాననీరు, బురద మేటవేసింది. ఇలాగే కొనసాగితే ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.1600 కోట్లతో బెంగళూరులోని కాలువలను అభివృద్ధి చేస్తామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. వర్ష బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. డ్రైనేజీలు, భూగర్భ డ్రైనేజీలను మరమ్మతు చేసి వాననీరు సజావుగా వెళ్లేలా చేస్తామన్నారు.

ఇళ్లలోకి నీరుచేరి గృహోపకరణాలు పాడయ్యాయి. వర్షాల వల్ల నష్టపోయిన వారికి రూ.25 వేలు పరిహారం అందిస్తాం, ఒకవారం పాటు ఆహారం అందిస్తామని సీఎం తెలిపారు.జేపీ నగర లేఔట్‌లో పలువురు మహిళల వర్ష కష్టాలపై సీఎంకు వినతులు అందచేశారు. అక్కడ నుంచి కమలానగర మెయిన్‌రోడ్డు, శంకరమఠ దేవస్దాన, హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఔట్‌ తదితర ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాగునీరు, విద్యుత్‌ లేవు, తినడానికి తిండి లేదు. అధికారులెవరూ తమను పట్టించుకోవడం లేదని సీఎంకి వివరించారు బాధిత మహిళలు.
Virat Kohli: అరుదైన రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు