Uttarpradesh: ఉత్తరప్రదేశ్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది కూలీలున్నారు. లక్నోలోని దిల్కుషా ప్రాంతం ఆర్మీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న కూలీలు కొందరు ఆ గోడ పక్కనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలీల గుడిసెలపై కూలి పడింది. శిథిలాల కింద చిక్కుకుని 9 మంది చనిపోయారు. గాయపడిన ఒక్కరిని మాత్రం పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఝాన్సీ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. అయితే ఈ గోడ కూలిన సమాచారం అందించింది బాధితుడేనని తెలిసింది. శిథిలాల కింద చిక్కుకున్న గోలు అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. పోలీసులకు ఫోన్ చేసిన ఒక్కడే ఈ ప్రమాదంలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
ఉన్నావ్ జిల్లా కాంతా గ్రామంలోని ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఝాలిహాయ్, కసందా గ్రామాల్లో ఇళ్లు కూలి ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫతేపూర్ జిల్లాలో ముగ్గురు, సీతాపూర్ జిల్లాలో ఒకరు, ప్రయాగ్రాజ్లో ఇద్దరు చిన్నారులు ఇంటి గోడకూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటీలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, సంఘటనా స్థలాన్ని, తర్వాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ (సివిల్) ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చేరిన క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
“లక్నోలో గోడ కూలిన కారణంగా ప్రజలు మరణించారనే వార్తతో నేను చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ముర్ము హిందీలో ట్వీట్ చేశారు.
Lucknow Wall Collapse: శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని ఫోన్ కాల్ రక్షించింది..
గురువారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాష్ట్రంలో శుక్రవారం 32.2 మిమీ సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 74 జిల్లాల్లో శుక్రవారం వర్షాలు పడ్డాయి. బారాబంకి (192.7 మిమీ), లక్నో (116.9 మిమీ), మౌ (110 మిమీ), బహ్రైచ్ (108 మిమీ), డియోరియా (78.5 మిమీ) బల్రాంపూర్ (64 మిమీ), బల్లియా (63.9 మిమీ), లఖింపూర్ ఖేరీ (58.7 మిమీ) సహా జిల్లాలు ఝాన్సీ (51), ఉన్నావ్ (14.7 మి.మీ), ప్రయాగ్రాజ్ (8.4 మి.మీ)లలో అధిక వర్షపాతం నమోదైంది.