Heat Wave: రానున్న రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. తూర్పు, దీపకల్ప భారతదేశంలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్ 9 వరకు ఈశాన్య ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ గంగానదీ పరివాహక ప్రాంతం, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలో ఈ రోజు, రేపు వడగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం మీదుగా వేడిగాలుల పరిస్థితులు ఇప్పటికే కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే ఏడు రోజుల్లో సబ్-హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో విస్తారంగా తేలికపాటి, మోస్తారు వర్షపాతం లేదా హిమపాతం కురుస్తుందని పేర్కొంది.
Read Also: Earthquake: న్యూయార్క్-న్యూజెర్సీలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు..
వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం బుధవారం సూచించింది. ప్రత్యేకించి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉష్ణోగ్రత కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై సమీక్ష జరిపిన తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది దేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. దీనికి తగ్గట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ దాటుతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్ నినో’ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.