RBI Interest Rates: ఇంటి రుణాలతోపాటు.. ఇతరత్రా రుణాలు తీసుకునే వారికి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో.. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. ఆగస్టులో జరిగే సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 8 నుంచి 10 తేదీల్లో ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Suriya: వీరుడొచ్చే వేలయ్యింది… కంగువా ఆగమనం
బుధవారం జరిగిన భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) సమావేశంలో దినేశ్ మాట్లాడారు. వడ్డీ రేట్లను సవరించేందుకు ఆర్‌బీఐ ఎన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని, ఇందులో ద్రవ్యోల్బణం ముఖ్యమని పేర్కొన్నారు. ఒక బ్యాంకుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని అనుకోవడం లేదని.. కానీ స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. జూన్ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును మార్చకుండా 6.5 శాతంగా ఉంచిన సంగతి విదితమే. రిటైల్‌కు గిరాకీ పెరుగుతున్నందున, విస్తరణ కోసం సంస్థలు మూలధన పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు. వినియోగం పెరుగుతున్నందుకు, సామర్థ్య విస్తరణకు కార్పొరేట్ సంస్థలూ పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు మూలధన పెట్టుబడులు సరైన మార్గంలోనే వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సేవల రంగంలో కొత్తతరం ఫిన్‌టెక్ సంస్థలు కీలకంగా మారాయని దినేశ్ ఖారా పేర్కొన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతికతలను వినియోగిస్తూ, ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గడిచిన కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నదని కాబట్టి ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే ఆర్బీఐ కొనసాగించవచ్చన్నారు.