Halal Meat Boycott issue in Karnataka: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా దసరా ముందు మరో వివాదం ఏర్పడబోతోంది. దసరా ముందు రోజు ఆయుధ పూజ సందర్భంగా హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ జనజాగృతి సమితి, హిందువులను కోరుతోంది. హాలాల్ రహిత దసరా అంటూ ఈ సంస్థ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అక్టోబర్ 4న ఆయుధపూజ జరుపుకుంటారు హిందువులు. ఈ సమయంలో బెంగళూర్ లో హలాల్ మాంసాన్ని తీసుకోవద్దని కోరుతోంది హిందూ జనజాగృతి సమితి.
Read Also: Delhi Shocker: తోటి విద్యార్థిని హత్య చేసిన క్లాస్ మెట్స్
గతంలో కూడా కర్ణాటకలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తన ప్రచారం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉగాది పండగ సందర్భంగా హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మార్చి చివర్లో, ఏప్రిల్ ప్రారంభంలో హలాల్ బహిష్కరించాలని ప్రచారం చేస్తూ పోస్టర్లు వేశారు. హిందువులు ఎవ్వరూ కూడా హలాల్ మాంసాన్ని కొనుగోలు చేయవద్దని కోరారు. హలాల్ అనేది ‘ఆర్థిక జీహాద్’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి పేర్కొన్నారు. ముస్లింలు ఇతరులతో వ్యాపారం చేయకుండా నిరోధించడానికి జీహాద్ లాగా దీన్ని వాడుతున్నారని.. హలాల్ మాంసాన్ని వాడాలని వారు భావించినప్పుడు.. దానిని ఉపయోగించకూడదని చెప్పడంతో తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటక వ్యాప్తంగా గత కొంత కాలం నుంచి మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. హిజాబ్ అంశం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దీని తర్వాత బీజేపీ, పలు హిందూ సంస్థలకు చెందిన వ్యక్తులను చంపడంతో పాటు దాడులకు పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పీఎఫ్ఐ సంస్థ వీటి వెనక ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిగానే పలు హిందూ సంస్థలు ఇలాంటి వాటికి పిలుపునిస్తున్నాయి. మతపరమైన ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి.