NTV Telugu Site icon

Gurugram: గురుగ్రామ్‌ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు

Gurugramrain

Gurugramrain

అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి గురుగ్రామ్‌‌‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం అతలాకుతలం అయింది. మోకాలు లోతు నీళ్లతో ధనవంతులు నానా ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ 4, బుధవారం రోజున కేవలం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతే గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ రోడ్ నీట మునిగింది. రహదారులు చెరువులను తలపించాయి. దీంతో కోట్లాది రూపాయల ఖరీదైన కార్లు నీట మునిగాయి. మాజీ మెటా ఉద్యోగి అనుశ్రీ పవార్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో అత్యంత ధనవంతులు నివాసం ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో ఫ్లాటే రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే ఇక్కడ ఎంత పెద్ద వీఐపీలు ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది అరగంట పాటు కురిసిన వర్షానికి అల్లాడిపోయింది. ఖరీదైన భవనాల ముందు నీళ్లు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖరీదైన భవనాల ఎదుట ఇదేం పరిస్థితి అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీన్ని మనం ఏమని పిలవాలి? నది అనాలా? సముద్రం అనలా? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి మోకిలాలో కూడా ఖరీదైన విల్లాస్ నీటమునిగాయి. దీంతో విల్లాస్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోట్లలో విల్లాస్ కొనుగోలు చేస్తే.. ఒక్క వర్షానికే చిత్తడి చిత్తడి అయిపోయింది. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.