Gujarat Set To Vote For 788 Candidates On 89 Seats For 1st Phase: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. నేడు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఎన్నికలకమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉంటే తొలివిడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు తొలివిడతలో పోలింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీ నుంచి మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 14,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
గుజరాత్ దక్షిణ జిల్లాలు, సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో నెలకొన్న 19 జిల్లాల్లో తొలి విడత పోరు జరగనుంది. 2017 ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ పార్టీలు 40 స్థానాలను గెలుపొందాయి. అయితే ఈ సారి రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా పోటీలో నిలువనున్నాయి.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాలకు గానూ తమ అభ్యర్థులను నిల్చోబెట్టాయి. ఆప్ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపింది. బీఎస్పీ 57, బీటీపీ 14, సీపీఎం నలుగురు అభ్యర్థులను బరిలో దింపింది. తొలి విడతలో 339 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు.
Read Also: ISIS: ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతం..
ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ సౌరాష్ట్రలోని ద్వారకా జిల్లా ఖంభాలియా స్థానం నుంచి పోటీలో ఉన్నాడు. జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా పోటీ చేస్తున్నారు. సూరత్ నుంచి బీజేపీ మంత్రి హర్ష్ సంఘవి పోటీలో ఉన్నారు. తొలి విడత ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పట్టు ఉంది. ఇక సూరత్ ప్రాంతం బీజేపీకి కంచుకోటగా ఉంది.
గుజరాత్ లో మొత్తం 4,91,35,400 మంది ఓటర్లలో మొదటి దశ ఎన్నికల్లో 2,39,76,670 మంది ఓటు వినియోగించుకోనున్నారు. మొత్తం 14 వేల పోలింగ్ స్టేషన్లలో 3,311 పట్టణాల్లో, 11,071 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మొత్తం 2,20,288 మంది శిక్షణ పొందిన అధికారులు, ఉద్యోగులు విధుల్లో ఉంటారని ఈసీ తెలిపింది.