PM Modi: ట్రక్, టాక్సీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో మాట్లాడారు. ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి కొత్త సౌకర్యాలతో ఆధునిక భవనాలను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. లక్షలాది ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని, వారు తరుచు చాలా గంటలు పనిచేస్తారని, వారికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటారని ప్రధాని అన్నారు.
Read Also: Monkey Fever Cases: కర్ణాటకలో 31 “మంకీ ఫీవర్” కేసులు నమోదు.. అసలేంటీ వ్యాధి, దాని లక్షణాలు ఏంటి..?
అయితే, దూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు సరైన విశ్రాంతి పొందేలా కేంద్రం చొరవ తీసుకుంటుందని తెలియజేశారు. అన్ని జాతీయ రహదారులపై ఆహారం, నీరు, వాష్రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో మెరుగైన సౌకర్యాలతో ఆధునిక భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ప్రణాళిక మొదటిదశలో దేశవ్యాప్తంగా 1000 భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
గత నెలలో ట్రక్, టాక్సీ డ్రైవర్లు దేశవ్యాప్తంగా విధుల్ని బహిష్కరించారు. కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయసంహిత(BNS)లోని ‘హిట్ అండ్ రన్’ చట్టం కింద శిక్షల్ని పెంచడాన్ని డ్రైవర్లు తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాస్తారోకో ఆందోళనలు నిర్వహించారు. అయితే, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ని సంప్రదించిన తర్వాతే కొత్త చట్టాలను తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే తాజాగా డ్రైవర్ల సంక్షేమం కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందని తాజాగా ప్రధాని ప్రకటించడం గమనార్హం.